Kishan Reddy : కిషన్ రెడ్డి కీలక ప్రకటన.. బీఆర్ఎస్ కు మేలు చేసే అంశమేనా..!
Qubetvnews - February 21, 2024 / 09:49 AM IST
Kishan Reddy :
గత కొన్ని రోజులుగా తెలంగాణలో ఓ ప్రచారం బలంగా వినిపిస్తోంది. అదేంటంటే బీజేపీ, బీఆర్ ఎస్ ఒక్కటే అని. ఆ రెండు పార్టీలు బయటకు తిట్టుకుంటున్నా సరే.. లోపల మాత్రం ఒక్కటే అని పదే పదే కాంగ్రెస్ నేతలు ప్రచారం చేస్తున్నారు. మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ దీన్ని బలంగా ప్రచారం చేసింది. అది బీఆర్ ఎస్ కు కొన్ని వర్గాల ఓట్లను దూరం చేసింది. దాంతో బీఆర్ ఎస్ కు గట్టి దెబ్బే తగిలిందని చెప్పుకోవాలి. అయితే దాన్ని తిప్పి కొట్టేందుకు బీఆర్ ఎస్ ఎన్ని ప్రయత్నాలు చేసినా పెద్దగా వర్కౌట్ కాలేదు. కాంగ్రెస్ ప్రచారం ప్రజల్లోకి బలంగా వెళ్లింది.
ఇక కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఈ ప్రచారాన్ని బలంగా ప్రజలకు వినిపిస్తోంది. మొన్న మేడిగడ్డను సందర్శించినప్పుడు బీఆర్ ఎస్, బీజేపీ పార్టీల ఎమ్మెల్యేలు రాలేదు. దాంతో ఇదే విషయాన్ని కాంగ్రెస్ వాడుకుంది. బీఆర్ఎస్ అవకతవకలను బయట పెట్టేందుకు బీజేపీ ఎందుకు సహకరించట్లేదని రేవంత్ రెడ్డి స్వయంగా ఆరోపించారు. దాంతో మరోసారి బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటే అనే నినాదం ప్రజల్లోకి వెళ్తోంది. ఇది ఎంపీ ఎన్నికల్లో దెబ్బ కొట్టే ప్రమాదం ఉందని అంటున్నారు నిపుణులు. ఇలాంటి సమయంలో ఇన్ని రోజులు స్పందించని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి తాజాగా సంచలన ప్రకటన చేశారు.
ఆయన మాట్లాడుతూ బీజేపీ, బీఆర్ ఎస్ ఒక్కటే అనేది చాలా తప్పుడు ప్రచారం అని కొట్టి పారేశారు. అలాంటి ప్రచారం చేసే వారు మూర్ఖులు.. అలాంటి మూర్ఖులు, దుర్మార్గులు చేసే ప్రచారాన్ని మేం పట్టించుకోం. మెడ మీద తలకాయ ఉన్నోడు ఎవరూ బీఆర్ఎస్ తో పొత్తులు పెట్టుకోడు. అది మునిగిపోయే నావ అంటూ తేల్చి చెప్పేశాడు కిషన్ రెడ్డి.
కాగా కిషన్ రెడ్డి చేసిన కామెంట్లు ఎంతో కొంత బీఆర్ఎస్ కు కలిసి వచ్చే అంశం ఉందని అంటున్నారు. ఇన్ని రోజులు బీఆర్ఎస్ మాత్రమే దీన్ని బలంగా ప్రచారం చేసింది. కానీ వర్కౌట్ కాలేదు. ఇప్పుడు బీజేపీ కూడా చెబుతోంది కాబట్టి మొన్నటి ఎన్నికల్లో బీఆర్ఎస్ కు దూరమైన కొన్ని వర్గాలు మళ్లీ దగ్గరయ్యే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. మొత్తానికి ఈ ప్రకటన కాస్త బీజేపీ కంటే బీఆర్ఎస్ కే ఎక్కువ మేలు చేసే అంశాలు ఉన్నాయని చెబుతున్నారు.





