Kishan Reddy : అధికారం కోసం రేవంత్ రెడ్డి ఎంతకైనా తెగిస్తాడు : కిషన్ రెడ్డి
Qubetvnews - May 12, 2024 / 10:00 AM IST
Kishan Reddy :
సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రచారంలో చివరి రోజు ప్రత్యర్థులపై ఘాటు విమర్శలు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీరుపై మరియు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై కిషన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. అధికారం కోసం సీఎం రేవంత్ రెడ్డి మరియు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ లు ఎంతకైనా తెగిస్తారు. కేసీఆర్ మాదిరిగానే రేవంత్ రెడ్డి కూడా అత్యంత ప్రమాదకారి. అబద్దాలు చెప్పడంలో వీరిద్దరూ ఆరితేరారు. కాంగ్రెస్ పార్టీ అబద్ధాలను ఇంటిపేరుగా మార్చుకుంది.
కాంగ్రెస్ ఇచ్చిన హామీల్లో ఉచిత బస్సు ప్రయాణం తప్ప ఏదీ అమలు కాలేదన్నారు. తన 100 రోజుల పాలన రెఫరెండమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారని… కానీ దేనిపైనో చెప్పాలన్నారు. కాంగ్రెస్ అవినీతి పైనా? ఆర్ ఆర్ ట్యాక్స్ పైనా? లేక ఆరు గ్యారెంటీల అమలుపై రెఫరెండమా? చెప్పాలని నిలదీశారు. దేశభక్తి, ధర్మబద్ధ పాలనకు ప్రజలు ఓట్లు వేసి అండగా ఉండాలని కోరారు. అబద్ధాలతో కాంగ్రెస్ 70 ఏళ్లుగా రాజకీయం చేస్తోంది. కాంగ్రెస్ అధికారంలో ఉన్నన్ని రోజులు ఆ పార్టీ చేతకానితనం, అసమర్థత కారణంగా పాకిస్థాన్ దౌర్జన్యాలకు అడ్డుకట్ట వేయలేకపోయామన్నారు. కానీ మోదీ హయాంలో పాక్ కు బుద్ది చెప్పాం అన్నారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కిషన్ రెడ్డి లేఖ రాశారు. కాంగ్రెస్ హామీలు, ప్రకటనలు ఆ పార్టీని మరింత దిగజార్చేలా ఉన్నాయని, తెలంగాణ ప్రజలను అవమానించేలా ఉన్నాయన్నారు కిషన్ రెడ్డి. చాలా హామీలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్రప్రభుత్వం ఇప్పటికే అమలు చేసిందని, మరికొన్నింటిని అమలు చేస్తుందన్నారు. బడ్జెట్ లో కేంద్రం ప్రకటించిన పీఎం సూర్య ఘర్ ముఫ్త్ బిజిలీ యోజనను పేరు మార్చి కొత్త కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టారని, ఈ పథకానికి ప్రజల్లో వస్తున్న ఆదరణ చూసి భయపడిన కాంగ్రెస్ పార్టీ.. ఈ అంశాన్ని కాస్త అటు, ఇటుగా మార్చి కొత్తగా ఏదో వాగ్దానం చేస్తున్నట్లు మేనిఫెస్టోలో పెట్టిందన్నారు.
దక్షిణ భారత సాంస్కృతిక కేంద్రం, ఘంటసాల ఆడిటోరియం, CSIR-IICT ప్రాంగణంలో సైన్స్ ఎక్స్పీరియన్స్ సెంటర్ వంటివి హైదరాబాద్ నగరాన్ని కల్చరల్, ఎంటర్టైన్మెంట్ హబ్‌గా మారుస్తున్నాయని, కాంగ్రెస్ ప్రకటించిన ఇంటర్నేషనల్ కల్చరల్, ఎంటర్టైన్మెంట్ హబ్ తో కొత్తగా కలిగే ప్రయోజనం ఏముంది. కాజీపేటలో ఇప్పటికే రైల్ మ్యానుఫాక్చరింగ్ యూనిట్ ను మోదీ ప్రభుత్వం ఏర్పాటు చేసిందని, ఇప్పుడు కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తామనడం పూర్తయిన హామీని మళ్లీ ఇచ్చినట్టుంది. రాజకీయ అవసరాల కోసం కాంగ్రెస్ బయ్యారం ఉక్కు కార్మాగారాన్ని తెరపైకి తెచ్చిందని, ఇవన్నీ ఉత్తి హామీలే. 2014లో కాంగ్రెస్ నేతృత్వంలోని యుపిఎ ప్రభుత్వం రూపొందించి, ఆమోదిందిచిన ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారమే భద్రాచలం మండలంలోని ఐదు గ్రామాలు ఆంధ్రప్రదేశ్ కు బదిలీ అయ్యాయి అన్నారు.
తెలంగాణలో కొత్త సైనిక పాఠశాలలు, కేంద్రీయ విద్యాలయాలు, నవోదయ విద్యాలయాల ఏర్పాటుకు మోదీ ప్రభుత్వం సిద్ధంగా ఉందని, అయితే గత రాష్ట్ర ప్రభుత్వం నుంచి స్పందన లేకపోయిందని, ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వమైనా ఇందుకు సహకరించాలని అన్నారు. హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారికి సమాంతరంగా ర్యాపిడ్ రైల్ ట్రాన్సిట్ సిస్టమ్, తెలంగాణలో కొత్త విమానాశ్రయాల ఏర్పాటు, జాతీయ విమానయాన విశ్వవిద్యాలయం ఏర్పాటు అమల్లోనే ఉన్నాయని, మోదీ ప్రభుత్వ ప్రాజెక్టులను తమ ఘనతలు చెప్పుకోవాలన్న తాపత్రయం తప్పితే తెలంగాణకు మేలు చేయాలన్న ఆలోచన కాంగ్రెస్ కు లేదు అన్నారు. జాతీయ భద్రతపై బుజ్జగింపుల రాజకీయాలు నడపడమే కాంగ్రెస్ విధానం అని దుయ్యబట్టారు.
26/11 ముంబై దాడుల నుండి హైదరాబాద్ వరుస పేలుళ్ల వరకు, అలాగే జమ్మూ కాశ్మీర్లో పౌరులు, సైనికులపై దాడులు అన్నీ కాంగ్రెస్ హయాంలోనే జరిగాయి. వీటికి ఆ సమయంలో అధికారంలో ఉన్న యూపీఏ హయాంలోని ఇంటెలిజెన్స్ వైఫల్యాలే అందామా? ఆ ఘటనలకు సోనియా గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ను బాధ్యలను చేసే ధైర్యం రేవంత్ రెడ్డికి ఉందా అని కిషన్ రెడ్డి ప్రశ్నించారు. ఇకనైనా రేవంత్ రెడ్డి చౌకబారు రాజకీయాలు చేయడం మానేసి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారెంటీల హామీల అమలుపై దృష్టి సారించాలని హితవు పలికారు.





