Kishan Reddy : తెలంగాణలో 12 ఎంపీ సీట్లు గెలుస్తాం.. అభివృద్ధి పనులను ప్రజలముందు పెట్టిన కిషన్ రెడ్డి..!
Qubetvnews - April 18, 2024 / 06:43 PM IST
Kishan Reddy : తెలంగాణలో 17 లోక్ సభ స్థానాలకు గాను 12 స్థానాలను బీజేపీ గెలుచుకుంటుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. రాబోయే ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ కు, బీజేపీకి మధ్యనే పోటీ ఉందని చెప్పారు. బీజేపీకే ఎక్కువ సీట్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఆ విధంగా బీజేపీ కార్యకర్తలు చురుగ్గా పని చేయాలని సూచించారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఏం చేయకున్నా.. అనుకోకుండా అధికారంలోకి వచ్చిందని చెప్పారు. మల్కాజ్ గిరి స్థానానికి పార్టీ అభ్యర్థి ఈటల రాజేందర్ తో కలిసి నామినేషన్ దాఖలు చేసిన అనంతరం కిషన్ రెడ్డి మాట్లాడారు.
రాహుల్ గాంధీ కాంగ్రెస్ నేతగా ఉన్నంత కాలం బీజేపీకి ఎలాంటి ఇబ్బందులు ఉండవని వ్యాఖ్యానించారు. ఇప్పటి వరకు తెలంగాణకు బీజేపీ ఏం చేసిందనేది కూడా క్లుప్తంగా వివరించారు ఈటల రాజేందర్. తెలంగాణకు ఇప్పటి వరకు కేంద్ర బీజేపీ ప్రభుత్వం రూ.10లక్షల కోట్లు కేటాయించిందని వెల్లడించారు. నామినేషన్ దాఖలు చేయడానికి ఒక రోజు ముందు రాష్ట్ర బీజేపీ చీఫ్ ఈ నివేదికను ప్రజలకు విడుదల చేశారు. కేంద్ర పన్నుల్లో తెలంగాణకు వాటా కింద రూ.2.03 లక్షల కోట్లు వచ్చినట్టువివరించారు. ఇతర అభివృద్ధి పథకాల కింద రూ.6.02 లక్షల కోట్లు ఖర్చు చేశామన్నారు.
ఇక సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కిషన్ రెడ్డి తాను గత ఐదేండ్లుగా సికింద్రాబాద్ కు చేసిన అభివృద్ధి పనులను రిపోర్టు టు పబ్లిక్ అనే ప్రోగ్రామ్ ద్వారా విడుదల చేశారు. జాతీయ రహదారుల అభివృద్ధి, రైల్వే ప్రాజెక్టులు, కాజీపేటలో రైలు తయారీ యూనిట్, వరంగల్ లో పీఎం మిత్ర టెక్స్ టైల్ పార్కు, రామగుండంలో ఏర్పాటు చేసిన కొత్త ఎరువుల కర్మాగారం, వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ కింద హైదరాబాద్ మెట్రో ప్రాజెక్టుకు ఇచ్చిన నిధులు, సిద్దిపేట జిల్లాలో ఏర్పాటు చేసిన శ్రీ కొండా లక్ష్మణ్ బాపూజీ ఉద్యాన విశ్వవిద్యాలయం, ములుగులో ఏర్పాటు కానున్న సమ్మక్క సారక్క జాతీయ గిరిజన విశ్వవిద్యాలయం ఇవన్నీ తన చొరువతోనే జరిగాయన్నారు.
దాంతో పాటు బీబీనగర్ ఎయిమ్స్, హైదరాబాద్ ఐఐటీ, నేషనల్ యానిమల్ రిసోర్స్ ఫెసిలిటీ ఫర్ బయోమెడికల్ రీసెర్చ్, కొవిడ్ సమయంలో స్టార్ట్ చేసిన ఉచిత రేషన్ పంపిణీ, రైతులకు ఎరువుల సబ్సిడీ కూడా తన చొరవతోనే జరిగాయన్నారు. అంతే కాకుండా సికింద్రాబాద్ లో చేపట్టిన రైల్వే డెవలప్ మెంట్ పనులను కూడా వివరించారు.
సికింద్రాబాద్, కాచిగూడ, నాంపల్లి, బేగంపేట రైల్వేస్టేషన్లలో ఎయిర్ పోర్టు తరహా సౌకర్యాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల నుంచి నాలుగు వందేభారత్ రైళ్లను ప్రారంభించడం, హైదరాబాద్ చుట్టూ రీజినల్ రింగ్ రోడ్డు, దాంతో పాటు ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు రోడ్డు ప్రాజెక్టులు, ఇతర ప్రాజెక్టులను కేంద్ర బీజేపీ ప్రభుత్వం చేపట్టినట్టు వివరించారు.





