Kishan Reddy : రూ.2లక్షల రుణమాఫీ ఏమైంది.. రైతుదీక్షలో కిషన్ రెడ్డి ఆగ్రహం..!
Qubetvnews - April 15, 2024 / 08:17 PM IST
Kishan Reddy : తెలంగాణ ఎంపీ ఎన్నికల్లో భాగంగా అభ్యర్థులు ఎక్కడికక్కడ ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. ఇక సికింద్రాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి అయిన కిషన్ రెడ్డి కూడా అటు ప్రచారాన్ని హోరెత్తిస్తూనే ఇటు రాష్ట్ర ప్రజల సమస్యలపై గొంతెత్తుతున్నారు. ఇందులో భాగంగా సోమవారం నాడు రైతుదీక్షను నిర్వహించారు. ఇందులో ఆయన మాట్లాడుతూ తెలంగాణ రైతుల సమస్యలపై ప్రశ్నల వర్షం కురిపించారు. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల మీదనే ఈ దీక్షను ఏర్పాటు చేశారు. రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలు ఏమయ్యాయంటూ ప్రశ్నించారు కిషన్ రెడ్డి.
అధికారం కోసం అడ్డగోలు హామీలు ఇచ్చి ఇప్పుడు ఎందుకు నోరెత్తట్లేదని అడిగారు. రైతులకు డిసెంబర్ 9న రూ.2లక్షలు రుణమాఫీ చేస్తానని ప్రకటించిన కాంగ్రెస్.. నాలుగు నెలలు గడుస్తున్నా ఎందుకు మౌనంగా ఉందని మండిపడ్డారు. అంతే కాకుండా రైతుభరోసా కింద రూ.15వేలు ఇస్తానని చెప్పి ఇప్పుడు ఎందుకు దాటవేస్తున్నారని ప్రశ్నించారు. ప్రతి కొనుగోలుకు రూ.500 బోనస్ ఇస్తానని చెప్పిన కాంగ్రెస్ ఆ ఊసే ఎత్తకపోవడం ఏంటని మండిపడ్డారు. బోనస్ దేవుడెరుగు.. ఇంకా వడ్ల కొనుగోలు కేంద్రాలనే ఎందుకు స్టార్ట్ చేయట్లేదని విమర్శించారు.
వాస్తవానికి బీజేపీ ప్రభుత్వం రైతుల కోసం చేసినంత ఏ పార్టీ కూడా చేయలేదని స్పష్టం చేశారు. కాంగ్రెస్ హయాంలో వరికి క్వింటాలుకు రూ.1400 ఇచ్చేవారు.. కానీ నరేంద్రమోడీ వచ్చిన తర్వాత 2200 ఇస్తున్నారు. ఎంత తేడా ఉందో గమనించాలని కోరారు. తెలంగాణలో కేవలం వరి కొనుగోలు కోసం ప్రతి సీజన్ లో రూ.26 వేల కోట్లు కేంద్రం ఖర్చు చేస్తోందని వివరించారు. ఆఖరకు కొనుగోలు సమయంలో పని చేసే రాష్ట్ర ఉద్యోగులకు కూడా కమీషన్ కింద కేంద్రంలో జీతాలిస్తోందని గుర్తు చేశారు. మరి అంతాకేంద్రమే చూసుకుంటే రాష్ట్ర ప్రభుత్వానికి కొనుగోలు కేంద్రాలు ప్రారంభించడం కూడా చేతకావట్లేదా అని మండిపడ్డారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు మరో మాట మారుస్తోందని మండిపడ్డారు. 17 ఎంపీ స్థానాలు గెలిపిస్తేనే హామీలు అమలు చేసుకోగలుగుతాం అని చెబుతున్నారు. మళ్లీ ఓట్ల కోసం దొంగనాటకాలు ఆడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు కిషన్ రెడ్డి. అలవు గాని హామీలు ఎవరు ఇవ్వమన్నారని ప్రశ్నించారు.
సాధ్యం కాని హామీలతో ప్రజలను మోసం చేసి ఇప్పుడు హామీలు ఎక్కడా అంటే మౌనరాగం ఎత్తుకుంటున్నారని.. కేంద్రంలో అధికారంలోకి కాంగ్రెస్ ఎలాగూ రాదు కాబట్టి.. దేశమంతా కోరుకుంటున్న నరేంద్రమోడీ నాయకత్వాన్ని నమ్మి బీజేపీకి ఓటేయాలని కోరారు కిషన్ రెడ్డి.





