brs leaders joined to other partys : బీఆర్ ఎస్ అలెర్ట్ కాకుంటే నష్టమే.. కేసీఆర్ రంగంలోకి దిగాల్సిందేనా..?
Qubetvnews - March 3, 2024 / 09:47 AM IST
brs leaders joined to other partys : అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయినప్పటి నుంచి బీఆర్ ఎస్ గ్రాఫ్ పడిపోతుందనే టాక్ బలంగా వినిపిస్తోంది. అయితే గ్రాఫ్ ను కాపాడుకునేందుకు కేటీఆర్ చాలా రకాలుగా కష్టపడుతున్నారు. కానీ పదేండ్ల పరిపాలన కాలంలో కాళేశ్వరం ప్రాజెక్టు గురించి బీఆర్ ఎస్ మొన్నటి వరకు గొప్పగా చెప్పుకుంది. ఆ క్రెడిబిలటీ మీద ఇప్పుడు కాంగ్రెస్ దెబ్బ కొడుతోంది. వరుసగా కాళేశ్వరంలో అవకతవకలు అంటూ ప్రచారం చేయడం.. దనిపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వడం, మేడిగడ్డ సందర్శన, అసెంబ్లీలో రచ్చ చేసి మరీ బీఆర్ ఎస్ మీద ప్రజల్లో వ్యతిరేకత తీసుకొచ్చే ప్రయత్నం చేస్తోంది కాంగ్రెస్ ప్రభుత్వం.
దాంతో ఇప్పుడు బీఆర్ ఎస్ మీద సొంత పార్టీ నాయకులకు కూడా నమ్మకం పోతోంది. రాబోయే ఎంపీ ఎన్నికల్లో కచ్చితంగా జాతీయ పార్టీల హవా ఉంటుందని బీఆర్ ఎస్ కు తెలుసు. అందుకే కేటీఆర్ తో నియోజకవర్గాల సమావేశాలు నిర్వహించేలా చేశారు కేసీఆర్. కానీ అది సరిపోయినట్టు లేదు. ఇప్పుడు వచ్చే ఎంపీ ఎన్నికల్లో ఎక్కడ తమకు టికెట్ రాదో అనే అనుమానంతో చాలా మంది సిట్టింగ్ ఎంపీలు ఇప్పుడు పక్క చూపులు చూస్తున్నారు. ఇప్పటికే పెద్దపల్లి ఎంపీ వెంకటేశ్ నేత కాంగ్రెస్ గూటికి వెళ్లిపోయారు. అటు జహీరాబాద్ ఎంపీ బీజేపీలోకి వెళ్లారు.
దాంతో పాటు ఎంపీ రాములు కూడా బీజేపీ కండువా కప్పుకున్నారు. మిగిలిన సిట్టింగ్ ఎంపీల్లో ఎంత మంది ఉంటారో తెలియని పరిస్థితి. ఇలా సిట్టింగ్ ఎంపీలు వెళ్లిపోవడం అంటే అది బీఆర్ ఎస్ కు గట్టి దెబ్బ అనే చెప్పుకోవాలి. వారిలో కొందరికి టికెట్ ఇస్తామనే ఆశ ఉన్నా సరే వారు మాత్రం బీఆర్ ఎస్ నుంచి గెలుస్తామో లేదో అనే అనుమానంతో పార్టీని వీడుతున్నారు. దాంతో ఇప్పుడు బీఆర్ ఎస్ నాయకత్వం మీదనే అనుమానాలు కలుగుతున్నాయి. చాలా రోజులుగా కేసీఆర్ ఇంట్లోనే రెస్ట్ తీసుకుంటున్నారు. పార్టీ బాధ్యతలు మొత్తం కేటీఆర్ కు అప్పగించేశారు.
కానీ ఎందుకో సిట్టింగ్ ఎంపీలు ఇలా వెళ్లిపోతుంటే వారిని ఆపడంలో కేటీఆర్ పెద్దగా సక్సెస్ కాలేకపోతున్నారనే ప్రచారం జరుగుతోంది. దాంతో ఇప్పుడు బీఆర్ ఎస్ లో అలజడి మొదలైంది. ఇది చల్లారాలి అన్నా.. మిగిలిన వారు కూడా వెళ్లిపోకుండా చూడాలి అన్నా సరే కేసీఆర్ రంగంలోకి దిగాల్సిందే అంటున్నారు.
ఇప్పుడు గనక కేసీఆర్ రంగంలోకి దిగి వెళ్లిపోతున్న వారికి స్పష్టమైన హామీలు ఇచ్చి అడ్డుకోకుంటే మాత్రం కచ్చితంగా బీఆర్ ఎస్ కు గట్టి దెబ్బ పడటం ఖాయమే అంటున్నారు రాజకీయ నిపుణులు. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న కేసీఆర్ మాత్రమే ఇప్పుడు బీఆర్ ఎస్ ను కాపాడుకోగలరని చెబుతున్నారు.


