Kishan Reddy : కిషన్ రెడ్డికి మద్దతుగా సీనియర్ హీరోయిన్ ఖుష్బూ ప్రచారం
Qubetvnews - April 28, 2024 / 09:09 AM IST
Kishan Reddy :
సికింద్రాబాద్ పార్లమెంటు నియోజకవర్గం బిజెపి అభ్యర్థి కిషన్ రెడ్డి ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. ప్రతిరోజు రెండు లేదా మూడు అసెంబ్లీ నియోజకవర్గాల సెగ్మెంట్స్ లో ప్రచారం చేస్తున్న కిషన్ రెడ్డి నేడు కూడా నియోజకవర్గం లోని పలు ప్రాంతాల్లో పర్యటించారు. అంతే కాకుండా ఇతర నియోజకవర్గాల్లో కూడా బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు హోదాలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కిషన్ రెడ్డి కి మద్దతుగా సికింద్రాబాద్ పార్లమెంట్ స్థానం లో సీనియర్ నటి కుష్బూ ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
కుష్బూ రోడ్ షో కి భారీ ఎత్తున తరలి వచ్చారు. కిషన్ రెడ్డి ని గెలిపించాల్సిందిగా కుష్బూ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. నరేంద్ర మోడీ మళ్లీ ప్రధాని అయితే దేశం మరింత అభివృద్ది చెందుతుందని ఆమె పేర్కొన్నారు. అయిదు దశాబ్దాల కాలంలో ఎప్పుడు సాధ్యం కానీ అభివృద్దిని నరేంద్ర మోడీ చేసి చూపించారని, అందుకే బీజేపీకి ఓటు వేసి అభివృద్దిని కొనసాగించాలని ఆమె ప్రజలకు పిలుపునిచ్చారు. దేశ వ్యాప్తంగా బీజేపీ కి మరోసారి ఓటర్లు పట్టం కట్టేందుకు సిద్ధం అవుతున్నారని ఆమె ధీమా వ్యక్తం చేశారు.
రాష్ట్రంలో ఇటీవల అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల విషయంలో వెనక్కి తగ్గిందని, రాబోయే రోజుల్లో ఆ ప్రభుత్వం ప్రజలను మరింతగా మోసం చేస్తుందని కూడా కుష్బూ అన్నారు. మొత్తానికి స్టార్ క్యాంపెనర్ ని తీసుకొచ్చి ప్రచారం చేస్తున్న కిషన్ రెడ్డి గెలుపు ఖాయం అంటూ ఇప్పటికే పలు సర్వే రిపోర్ట్ లు వచ్చాయి.





