Revanth plan on kaleshwaram : ఆ విషయంలో రేవంత్ సర్కార్ వెనకడుగు.. బీఆర్ ఎస్ కు కలిసొస్తుందా..?
Qubetvnews - March 1, 2024 / 11:46 AM IST
Revanth plan on kaleshwaram : రేవంత్ రెడ్డి సీఎం అయినప్పటి నుంచి తమను వ్యక్తితంగా టార్గెట్ చేస్తున్నాడని బీఆర్ ఎస్ నేతలు వాపోతున్నారు. అందులోనూ మరీ ముఖ్యంగా కేసీఆర్ ఫ్యామిలీని ఇరకాటంలో పడేసే విధంగా రేవంత్ రెడ్డి కక్ష పూరిత చర్యలకు పాల్పడుతున్నట్టు చెబుతున్నారు బీఆర్ ఎస్ నేతలు. మరి రేవంత్ రెడ్డి తీసుకుంటున్న నిర్ణయాలు, చేస్తున్న పనులు కూడా అలాగే ఉంటున్నాయనుకోండి. అందులోనూ కాళేశ్వరం ప్రాజెక్టులో అవకతవకలు అంటూ రేవంత్ రెడ్డి పదే పదే ఆరోపణలు చేస్తున్నారు. మేడిగడ్డ పిల్లర్లు కుంగిపోవడాన్ని ఎమ్మెల్యేలను తీసుకెళ్లి సందర్శించడంతో పాటు దానిపై అసెంబ్లీలో చర్చ పెట్టడం కూడా చేశారు రేవంత్.
అంతే కాకుండా దానిపై ఎంక్వయిరీ చేయిస్తామని రేవంత్ సర్కార్ ఇంతకు ముందే చెప్పింది. అయితే ఇదే విషయంలో రేవంత్ సర్కార్ ఓ మాట జారింది. బీజేపీ-బీఆర్ ఎస్ ఒక్కటే అని.. అందుకే ఇన్ని రోజులు కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉండి కూడా కాళేశ్వరం అవినీతిపై సీబీఐతో దర్యాప్తు చేయించలేదని ఆరోపించారు రేవంత్. దాంతో బీజేపీ కూడా స్పందించింది. మీకు దమ్ముంటే సీబీఐకి విచారణ అప్పగించండి.. మిగతాది మేం చూసుకుంటాం అని కిషన్ రెడ్డి పదే పదే చెప్పారు. అదే విషయాన్ని బీజేపీ ఎమ్మెల్యేలు కూడా పదే పదే చెప్పారు.
కానీ సీబీఐకి అప్పగించడం అంటే బీజేపీ చేతిలోకి వెళ్లడమే అని రేవంత్ సర్కార్ భావిస్తోంది. ఎందుకంటే సీబీఐ కేంద్రం ఆధీనంలో ఉంటుంది. అప్పుడు కాళేశ్వరం విచారణ మొత్తం కేంద్రంలో చేతిలోకి వెళ్లిపోతుందని రేవంత్ సర్కార్ ఆలోచిస్తోంది. అందుకే ఇప్పుడు రేవంత్ సర్కార్ ఈ విషయంలో వెనకడుగు వేస్తోంది. అయితే దీన్ని బీఆర్ ఎస్ బలంగా ప్రచారం చేసుకునేందుకు కూడా అవకాశం ఉంది. తాము తప్పు చేస్తే దమ్ముంటే సీబీఐకి అప్పగించండి అని ఇప్పటికే బీఆర్ ఎస్ పదే పదే డిమాండ్ చేస్తోంది. తాము తప్పు చేయలేదు కాబట్టే రేవంత్ సర్కార్ సీబీఐకి అప్పగించడానికి వెనకడుగు వేస్తోందని బీఆర్ ఎస్ చెబుతోంది.
ఈ విషయంలో రేవంత్ సర్కార్ వెనకడుగు వేయడం వల్ల బీఆర్ ఎస్ కు కలిసొస్తోందని అంటున్నారు రాజకీయ నిపుణులు. ఒకవేళ రేవంత్ సర్కార్ సీఐడీ లేదా ఏసీబీకి అప్పగించినా పెద్దగా ఎఫెక్ట్ పడకపోవచ్చన్నది బీఆర్ ఎస్ అభిప్రాయం. అందుకే ఇప్పుడు ధైర్యంగా ఎవరితో అయినా ఎంక్వయిరీ చేయించండి అని చెబుతున్నారు బీఆర్ ఎస్ నేతలు.
తాము ఎక్కడకు రమ్మన్నా వస్తామని.. తమ తప్పులేదు కాబట్టే తాము ఎలాంటి విచారణకు అయినా సిద్ధమే అని బల్లగుద్ది చెబుతున్నారు బీఆర్ ఎస్ నేతలు. ఈ విషయంలో రేవంత్ సర్కార్ ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేకపోతోంది. కాబట్టి రేవంత్ సర్కార్ ఆలస్యం బీఆర్ ఎస్ కు కలిసొచ్చేలా ఉందంటున్నారు.





