Revanth targets Hyderabad voters : టార్గెట్ హైదరాబాద్ ఓటర్లే.. రేవంత్ సరికొత్త వ్యూహాలు..!
Qubetvnews - February 25, 2024 / 08:35 AM IST
Revanth targets Hyderabad voters : రేవంత్ రెడ్డి సీఎం అయిన తర్వాత చాలా విషయాల్లో ఆచి తూచి వ్యవహరిస్తున్నారు. ఇంతకు ముందు కాంగ్రెస్ కు ఏయే వర్గాలు మద్దతుగా ఉండేవో.. ఇప్పుడు ఎందుకు దూరమయ్యాయో ఆరా తీస్తున్నారు. అంతే కాకుండా అసలు కాంగ్రెస్ పార్టీకి ఎక్కడ, ఏ జిల్లాలో పట్టు లేదో తెలుసుకుని అక్కడ బలోపేతం చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా అసలు కాంగ్రెస్ కు పట్టులేని చోట తిరిగి బలం పెంచుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. మొన్నటి ఎన్నికల్లో కాంగ్రెస్ కు దారుణమైన దెబ్బ తగిలింది హైదరాబాద్ లోనే. తెలంగాణ రాజధాని హైదరాబాద్.
దేశంలోనే నెంబర్ వన్ దిశగా దూసుకుపోతున్న సిటీల్లో హైదరాబాద్ కూడా ఉంది. ఇలాంటి కీలకమైన హైదరాబాద్ లో కాంగ్రెస్ కు పట్టులేకపోవడం అంటే పరువు పోయినట్టే అని భావించారు రేవంత్ రెడ్డి. మొన్నటి ఎన్నికల్లో జీహెచ్ ఎంసీ పరిధిలో ఒక్క సీటు కూడా కాంగ్రెస్ కు రాలేదు. హైదరాబాద్ నగరం మొత్తంలో కాంగ్రెస్ కు కేవలం మూడు సీట్లు మాత్రమే వచ్చాయి. అందుకే ఇప్పుడు ఇక్కడ కాంగ్రెస్ హవాను తిరిగి పెంచాలని రేవంత్ భావిస్తున్నారు. ఇందులో భాగంగా ఆయన సీఎం అయిన తర్వాత హైదరాబాద్ సమస్యలపై ప్రత్యేకంగా దృష్టి పెడుతున్నారు.
ట్రాఫిక్ సమస్యలు, తాగునీటి సమస్యల గురించి నిత్యం అధికారులతో రివ్యూలు పెడుతున్నారు. మెట్రో కొత్త మార్గాలను త్వరలోనే ప్రారంభిస్తామని ఆర్డర్లు వేస్తున్నారు. అంతే కాకుండా జీహెచ్ ఎంసీ, హెచ్ ఎండీ లో అవినీతిపై తీవ్రంగా చర్యలు తీసుకుంటామని ఇప్పటికే అధికారులను హెచ్చరిస్తున్నారు. హైదరాబాద్ నగర ప్రజలు ఎలాంటి సమస్యలపై మీ వద్దకు వచ్చినా సరే వారిని ఇబ్బంది పెట్టొద్దని చెబుతున్నారు. ఒకవేళ వారితో అవినీతిగా ప్రవర్తిస్తే మాత్రం సదరు అధికారులను ఇంటికే పంపిస్తామని తీవ్రంగా హెచ్చరించారు రేవంత్ రెడ్డి.
హైదరాబాద్ లో లోతట్టు ప్రాంతాలు మునిగిపోకుండా చర్యలు తీసుకోవాలని రేవంత్ భావిస్తున్నారు. అంతే కాకుండా భయంకరంగా ఉన్న ట్రాఫిక్ సమస్యలను క్లియర్ చేసేందుకు అండర్ గ్రౌండ్ రోడ్ వేలను కూడా ఏర్పాటు చేయనున్నట్టు ఇప్పటికే ప్రకటించారు. ఇలా హైదరాబాద్ సమస్యలను అన్నింటినీ క్లియర్ చేయాలని భావిస్తున్నారు.
హైదరాబాద్ ను ఏళ్లుగా పట్టి పీడిస్తున్న సమస్యలను గనక క్లియర్ చేస్తే ప్రజల్లో తిరిగి కాంగ్రెస్ కు పట్టు పెరిగే అవకాశాలు ఎక్కువగానే ఉంటాయి. దాని వల్ల వచ్చే ఎంపీ ఎన్నికల్లో ఎంతో కొంత మేలు జరుగుతుందని రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. ఇలా అన్ని వర్గాలను తిరిగి అక్కున చేర్చుకునేందుకు రేవంత్ చేస్తున్న ప్లాన్ వర్కౌట్ అవుతుందనే అంటున్నారు రాజకీయ నిపుణులు.




