Congress : ఆర్ ఎస్ ప్రవీణ్ కు ఎంపీ టికెట్.. కాంగ్రెస్ కు ప్రచార అస్త్రమేనా..?
Qubetvnews - March 26, 2024 / 09:29 AM IST
Congress : ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్.. గతంలో ఐపీఎస్ అధికారి. స్వేరో సంస్థలను ఏర్పాటు చేసి గురుకుల పాఠశాలలను ఎంతో అద్భుతంగా తీర్చిదిద్దిన పేరు ఆయనకు ఉంది. అందులో ఎలాంటి అనుమానం లేదు. కానీ సర్వీసు ఉండగానే ఆయన పోస్టుకు రాజీనామా చేసి మరీ బీఎస్పీ పార్టీలో చేరారు. అప్పటి నుంచి బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడిగానే ఉన్నారు. ఇక ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బీఆర్ ఎస్ మీద, కేసీఆర్ మీద ఎన్ని ఆరోపణలు చేశారో.. ఎన్ని నిందలు వేశారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అలాంటి ఆయన మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఎస్పీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు.
అయినా సరే ఆయన బీఎస్పీలోనే ఉంటారని చాలా మంది అనుకుంటారు. కానీ ఆయన అనూహ్యంగా బీఆర్ ఎస్ లో చేరారు. ముందు బీఎస్పీ, బీఆర్ ఎస్ పొత్తులు అంటూ అన్నారు. కానీ ఏమైందో తెలియదు.. బీజేపీ పార్టీ పెద్దలతో పొత్తులు వద్దంటూ ఒత్తిడి తెస్తోందని.. అందుకే తాను తలొగ్గనని చెప్పి బీఆర్ ఎస్ లో చేరిపోయారు. అయితే ఇప్పుడు ఇక్కడే బీఆర్ ఎస్ కు కలిసొస్తుందని కేసీఆర్ అనుకున్నారు. ప్రవీణ్ కుమార్ తన పార్టీలోకి వస్తే దళితులు, మైనార్టీలు, బహుజనులు, మేథావులు తనవైపే ఉంటారని కేసీఆర్ భావించారు.
ఇక ఆర్ ఎస్ ప్రవీణ్ కు నాగర్ కర్నూల్ ఎంపీ టికెట్ కూడా ఇచ్చారు. ఇక్కడే కేసీఆర్ చేసిన పొరపాటును కాంగ్రెస్ పార్టీ ప్రచార అస్త్రంగా మార్చుకోవాలని భావిస్తోంది. ఎందుకంటే ఉమ్మడి పాలమూరు జిల్లాలో 14 ఎమ్మెల్యే స్థానాలు ఉంటే.. అందులో మొన్నటి ఎన్నికల్లో 12 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచింది. దీన్ని బట్టి అక్కడ బీఆర్ ఎస్ కు ఏ పాటి పట్టు ఉందో అర్థం చేసుకోవచ్చు. పైగా ఉమ్మడి పాలమూరులో ఉన్న స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు కూడా ఇప్పుడు కాంగ్రెస్ లోకి వెళ్లిపోతున్నారు. కాబట్టి ఎలా చూసినా ఈ సీటు బీఆర్ ఎస్ ఓడిపోయే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి.
ప్రవీణ్ కుమార్ దళితుడు కాబట్టి ఓడిపోయే స్థానం కేటాయించారని కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేసుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఒక దళిత మాజీ ఐపీఎస్ అధికారికి కేసీఆర్ ఇలాంటి గౌరవం ఇస్తారని అనుకోలేదని.. దళితులకు కేసీఆర్ ఇలా కూడా అవమానమే చేస్తున్నారంటూ కాంగ్రెస్ ప్రచారం చేసుకునే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి.
అంతే కాకుండా రాబోయే ఎన్నికల్లో ప్రవీణ్ కుమార్ కు ఓడిపోతామని తెలిసి కూడా ఎందుకు ఎంపీ టికెట్ ఇస్తున్నారో చెప్పాలంటున్నారు. ఇలా దళిత ఓట్లను ఆకట్టుకోవడం కోసమే ప్రవీణ్ కుమార్ ను చేర్చుకున్నారని.. కాంగ్రెస్ నేతలు ప్రచారం చేసుకుని దళితుల ఓట్లను ఆకర్షించే అవకాశాలు ఉన్నాయి.




