CM Revanth Reddy : ఒకే దెబ్బకు ఇద్దరిని టార్గెట్ చేయబోతున్న రేవంత్.. ఎంపీ ఎన్నికల కోసమే..!
Qubetvnews - February 27, 2024 / 10:03 AM IST
CM Revanth Reddy :
సీఎం రేవంత్ రెడ్డి చాలా ముందస్తు ఆలోచనలతో పని చేస్తున్నారు. ఆయన చేసే విమర్శలు, చేస్తున్న పనులు కూడా తనకు ఇచ్చిన టార్గెట్ ను చేరుకోవడం కోసమే అన్నట్టు సాగుతున్నాయి. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో రేవంత్ పనితీరుకు కాంగ్రెస్ ఢిల్లీ అధిష్టానం మెచ్చింది. అందుకే ఇప్పుడు ఎంపీ ఎన్నికల తెలంగాణ కమిటీ చైర్మన్ గా నియమించింది. దాంతో ఇప్పుడు రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కనీసం 12 స్థానాలు గెలవాలని రేవంత్ రెడ్డి టార్గెట్ గా పెట్టుకున్నారు. ఆయన నేతృత్వంలోనే మరోసారి ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ భారీగా సీట్లు సాధిస్తే తనకు తిరుగు ఉండదనేది రేవంత్ ఆలోచన.
అందుకే ఇప్పుడు ఎంపీ ఎన్నికల్లో అటు బీఆర్ఎస్, ఇటు బీజేపీ పార్టీలను ఒకేసారి టార్గెట్ చేయాలని డిసైడ్ అయ్యారు. ఇందులో భాగంగా తాజాగా ఆయన మాట్లాడుతూ.. గత రెండు ఎన్నికల్లో ఇటు రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ, అటు కేంద్రంలో బీజేపీ పార్టీ ఇచ్చిన హామీలను ఒక్కటి కూడా అమలు చేయలేదన్నారు. దమ్ముంటే వాటిపై చర్చించేందుకు రావాలంటూ కేసీఆర్ కు , కిషన్ రెడ్డికి సవాల్ విసిరారు రేవంత్ రెడ్డి. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం తెలంగాణకు ఒక్క రూపాయి కూడా కేటాయించలేదని.. ప్రజలను మోసం చేసిందన్నారు.
కేంద్ర ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి ఒక్క రోజు కూడా తెలంగాణ గురించి మాట్లాడలేదని.. తెలంగాణ సమస్యలను గాలికి వదిలేశారని చెప్పుకొచ్చారు. గత రెండు ఎన్నికల్లో మోడీ ఇచ్చిన హామీలు ఎందుకు అమలు చేయలేదన్నారు. నల్లధనం వెనక్కు తెచ్చారా.. రెండు కోట్ల ఉద్యోగాలు ఇచ్చారా.. రైతులకు ఇచ్చిన హామీలు నెరవేర్చారా.. ఇవేమీ చేయకుండానే మళ్లీ మోడీని ఎందుకు ప్రధానమంత్రిని చేయాలని మండిపడ్డారు రేవంత్ రెడ్డి. ఇటు బీఆర్ ఎస్ పార్టీ అయితే పదేండ్లలో తెలంగాణను ధ్వసం చేసిందని చెప్పుకొచ్చారు.
వందేండ్లు అయినా సరే తెలంగాణ కోలుకోలేనంతగా కేసీఆర నాశనం చేశారని మండిపడ్డారు. కాళేశ్వరం పేరుతో లక్ష కోట్లు ఇసుకలో పోశారని చెప్పుకొచ్చారు. కాబట్టి ఈ రెండు పార్టీలకు తెలంగాణ ప్రజలు ఎంపీ ఎన్నికల్లో ఎందుకు ఓటేయాలని ప్రశ్నించారు రేవంత్ రెడ్డి. ఇలా ఒకేసారి అటు బీజేపీ, ఇటు బీఆర్ ఎస్ ను టార్గెట్ చేస్తున్నారు.
అయితే రేవంత్ విసిరిన సవాళ్లపై ఇప్పటి వరకు అటు కేసీఆర్ గానీ, ఇటు కిషన్ రెడ్డి గానీ స్పందించలేదు. కాబట్టి ఈ రెండు విషయాల్లో రేవంత్ మరింత దూకుడు పెంచి వచ్చే ఎంపీ ఎన్నికల్లో భారీగా సీట్లు సాధించాలని డిసైడ్ అయినట్టు తెలుస్తోంది. మరి ఆయన ప్లాన్ ఏ మేరకు వర్కౌట్ అవుతుందో చూడాలి.





