CM Revanth Reddy : తీగ లాగుతున్న రేవంత్.. డొంక కదలనుందా..?

Qubetvnews - February 29, 2024 / 02:52 PM IST

CM Revanth Reddy : తీగ లాగుతున్న రేవంత్.. డొంక కదలనుందా..?

CM Revanth Reddy :

కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది.. రేవంత్ రెడ్డి సీఎం అయ్యాడు.. ఇంకేముంది పాత లెక్కలన్నీ బయటకు తీస్తాడని ముందు నుంచే టాక్ వినిపిస్తోంది. అనుకున్నట్టు గానే రేవంత్ ఒక్కో వ్యవహారాన్ని బయటకు లాగుతున్నాడు. ఇప్పటికే కాళేశ్వరం ప్రాజెక్టు మీద అవకతవకలు అంటూ నానా రచ్చ చేసేశాడు. ఇప్పుడు మరో అడుగు వేస్తున్నాడు. అదే అవుటర్ రింగ్ రోడ్డు టోల్ టెండర్లు. ఇప్పటికే ఒక్కో ప్రాజెక్టు, ఒక్కో టెండర్ విషయాలను బయటకు లాగుతున్నాడు. అందులో ఏమైనా అవకతవకలు జరిగాయా అనే విషయాన్ని ఆరా తీసి మరీ విచారణకు ఆదేశాలు ఇస్తున్నాడు.

ఇందులో భాగంగా ఇప్పుడు అవుటర్ రింగ్ రోడ్డు టోల్ టెండర్లపై విచారణ చేపట్టేందుకు ఆదేశాలు ఇచ్చారు. అవుటర్ రింగ్ రోడ్డు టోల్ టెండర్లపై తాజాగా సీఎం సమీక్ష నిర్వహించారు. ఇందులో తక్కువ రేటుకే టెండర్లు ఇచ్చినట్టు సీఎం గుర్తించారు. అసలు రేటు కూడా నిర్ణయించుకుండా టెండర్లను ఎందుకు పిలిచారు.. ఇంత తక్కువ మొత్తానికి టెండర్లను ఎలా పిలిచారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు రేవంత్. వాస్తవానికి ఈ టెండర్ల వల్ల ఏడాదికి రూ.600 కోట్లు ప్రభుత్వానికి ఆదాయం రావాలి. అంటే 30 ఏళ్లకు రూ.18వేల కోట్ల వరకు ఆదాయం రావాల్సి ఉండేది.

కానీ కేవలం రూ.7,380 కోట్లకు ఐఆర్ బీ కంపెనీకి ఎలా అప్పగించారని ముఖ్యమంత్రి ఆరా తీశారు. ప్రభుత్వ పెద్దలు, హెచ్ఎండీఏ అధికారులు అనుసరించిన విధానాలతోనే రూ.15వేల కోట్లు నష్టం వచ్చినట్టు సీఎం అంచనాకు వచ్చారు. సమగ్రంగా విచారణ చేపడితేనే అసలు నిజాలు బయటకు వస్తాయని రేవంత్ అభిప్రాయపడ్డారు. టెండర్ దక్కించుకున్న కంపెనీ ప్రభుత్వంతో చేసుకున్న కాంట్రాక్టు అగ్రిమెంట్ ను చూపించి 49 శాతం వాటాను విదేశీ కంపెనీలకు అప్పగించిందని, విదేశీ కంపెనీతో ఆ సంస్థ చేసుకున్న లావాదేవీలపై కూడా దర్యాప్తు చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు.

ఇందులో ఎవరెవరు ఉన్నారో వారిపై వ్యక్తిగతంగా కేసులు కూడా నమోదు చేయాలని రేవంత్ ఆదేశాలు ఇచ్చారు. త్వరలోనే దీనిపై సీబీఐ విచారణకు అప్పగించేందుకు కేబినెట్ లో నిర్ణయం తీసుకుంటామన్నారు రేవంత్. ఇలా సీఎం రేవంత్ ఆదేశాలు ఇవ్వడాన్ని బట్ట చూస్తుంటే బీఆర్ఎస్ ను టార్గెట్ చేసినట్టే ఉందని అంటున్నాయి రాజకీయ వర్గాలు.

ఎందుకంటే ఈ టోల్ టెండర్లను బీఆర్ ఎస్ హయాంలోనే చేపట్టారు. అంతే కాకుండా మున్సిపల్ మినిస్టర్ గా ఉన్న కేటీఆర్ కూడా ఇందులో ఇన్వాల్వ్ అయ్యారనే టాక్ ఉంది. కాబట్టి ఈ విషయంపై విచారణ చేపట్టి బీఆర్ ఎస్ పెద్దలను రేవంత్ ఇలా టార్గెట్ చేయబోతున్నారని చెబుతున్నారు. మరి ఇందులో ఎవరెవరి పేర్లు బయటకు వస్తాయో వేచి చూడాలి.

Read Today's Latest Telangana in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us

Related News