CM Revanth Reddy : రేవంత్ కే జై కొడుతున్న అసంతృప్తులు.. సీన్ మారిపోయిందా..!
Qubetvnews - February 20, 2024 / 09:30 AM IST
CM Revanth Reddy :
అదేంటో గానీ మొన్నటి వరకు కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రేవంత్ ను సొంత పార్టీ వాళ్లే ఎంతగా విమర్శించారో చూశాం. కనీసం రేవంత్ తన పని తాను చేసుకోకుండా ప్రతి విషయంలో అడ్డు పడ్డారు. ఇంకా చెప్పాలంటే అప్పుడు అధికారంలో ఉన్న బీఆర్ ఎస్ కు బదులు రేవంత్ నే ఎక్కువగా తిట్టారు కాంగ్రెస్ నేతలు. రేవంత్ ను కాంగ్రెస్ లోకి రానివ్వకుండా చాలా మంది అడ్డుకున్నారు. అంతే కాకుండా చివరకు రేవంత టీపీసీసీ అధ్యక్షుడు కాకుండా కూడా చాలా మంది అడ్డుపడ్డారు. దాంతో రేవంత్ ఒంటరిగా బీఆర్ ఎస్ పార్టీ మీద పోరాడారు.
అప్పట్లో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, రాజగోపాల్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, జగ్గారెడ్డి, హన్మంతరావులే కాకుండా చివరకు భట్టి విక్రమార్క లాంటి కూడా రేవంత్ రెడ్డిని దారుణంగా విమర్శించారు. రేవంత్ మీద ఏకంగా సోనియా గాంధీకి కూడా లేఖలు రాశారు. ఇలా రకరకాలగా రేవంత్ ను ఇబ్బంది పెట్టారు. కానీ రేవంత్ ఎన్నడూ కూడా వారి మీద కోపాన్ని బయటకు చూపించలేదు. కేవలం వారిని కలుపుకునిపోయేందుకు మాత్రమే ప్రయత్నాలు చేశారు. అంతే తప్ప ఎక్కడా కూడా అదుపు తప్పలేదు. ఇక అదే సమయంలో బీఆర్ఎస్ మీద తన పోరాటాన్ని కూడా ఆపకుండా పోరాడారు.
ఇలా అనునిత్యం పోరాటాన్ని చూపించారు కాబట్టే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. అంతే కాకుండా ఎవరి సపోర్టు లేకుండా ఇప్పుడు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అయితే ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డిని అందరూ కాంగ్రెస్ నేతలు మెచ్చుకుంటున్నారు. మొన్నటి వరకు రేవంత్ ను తిట్టిన నోళ్లే ఇప్పుడు శభాష్ అంటున్నారు. రేవంత్ ను సీఎం చేయడంలో కూడా ఎవరూ పెద్దగా అభ్యంతరం వ్యక్తం చేయలేదు. అంతే కాకుండా ఇప్పుడు చాలా మంది మంత్రి పదవులు రాకపోయినా సరే రేవంత్ కే తమ మద్దతు అంటున్నారు.
మొన్న అసెంబ్లీ వేదికగా ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. రేవంత్ సీఎంగా ఉండటమే కరెక్ట్ అన్నారు. అంతకు ముందు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మాట్లాడుతూ.. రేవంత్ పోరాటయోధుడు అని కొనియాడారు. రాజగోపాల్ రెడ్డి అసెంబ్లీ వేదికగా మాట్లాడుతూ… తామంతా ఒక్కటిగానే ఉన్నామని చెప్పారు.
రేవంత్ తన పట్ల సానుకూల నిర్ణయం తీసుకుంటారని చెప్పుకొచ్చారు. జగ్గారెడ్డి, హన్మంత రావు లాంటి వారు కూడా కాంగ్రెస్ రేవంత్ హయాంలోనే అధికారంలోకి వచ్చిందని బహిరంగంగానే ప్రకటిస్తున్నారు. ఇలా మొన్నటి వరకు రేవంత్ ను తిట్టిన నోర్లే ఇప్పుడు పొగుడుతున్నాయి. అసలు రేవంత్ సీఎం అయిన కొత్తలో.. ఆయన్ను అసంతృప్తులే గద్దె దించుతారనే టాక్ నడిచింది. కానీ ఇప్పుడు వారే రేవంత్ కు మద్దతుగా నిలుస్తున్నారంటే.. రేవంత్ కు వెయ్యి ఏనుగుల బలం వచ్చినట్టే అని చెబుతున్నారు.





